టాలీవుడ్: నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వం లో షూటింగ్ మొదలై అనివార్య కారణాలవలన ఆగిపోయిన సినిమా ‘నర్తనశాల‘. 2005 లో ఆగిపోయిన ఈ సినిమాని ఇపుడు బాలకృష్ణ విడుదల చేస్తున్నారు. అప్పట్లో షూటింగ్ పూర్తి చేసిన కొంత భాగాన్ని ఒక పదిహేడు నిమిషాల నిడివి గల వీడియో లాగా రూపొందించి శ్రేయాస్ ET యాప్ లో పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేస్తున్నారు. ఇది లాభం కోసం కాదని దీని ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం చారిటీ కోసం వినియోగించబోతున్నామని బాలకృష్ణ ఒక వీడియో లో చెప్పారు. ఈ సినిమాని ఈ దసరా సందర్భంగా అక్టోబర్ 24 న విడుదల చేయబోతున్నట్టు కూడా చెప్పారు.
ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదల అయింది. పాండవుల కథని ఇతివృత్తంగా తీసుకున్న ఈ సినిమా రూపొందించారు. పాండవులు జూదం లో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్లినప్పటి కథ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ చిత్రంలో దివంగత నటి సౌందర్య ‘ద్రౌపది’ పాత్రలో, దివంగత నటుడు ‘శ్రీహరి‘ భీముడి పాత్రలో అద్భుతంగా కుదిరారు అని చెప్పవచ్చు. ఎప్పటిలాగే ఇప్పుడున్న నటుల్లో పౌరాణికాల్లో బాలక్రిష్ణని మించిన వారు లేరని చెప్పవచ్చు, ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో బాలకృష్ణ మెప్పించాడు.