న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే నీట్ పరీక్షల తేదీలను ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఖరారు చేసి ప్రకటించారు. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ వచ్చే సెప్టెంబర్ 12వ తేదీన నీట్ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
ఈ పరీక్షకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను జూలై 13 మంగళవారం సాయంత్రం నుంచి స్వీకరించడం ప్రారంభిస్తారు. ఎన్‌టీఏ తన వెబ్‌సైట్ ద్వారా విద్యార్థుల నుంచి ఈ పరీక్షకు దరఖాస్తులను స్వీకరించనుంది. కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198 కి పెంచినట్లు ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పరీక్ష నిర్వహించే నగరాలతో పాటుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల, మాజీ విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్ 2021 తేదీలను ప్రకటించన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకు, జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.