జాతీయం: 2024 నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందే 144 మంది అభ్యర్థులకు ప్రశ్నా పత్రం చేరిందని సీబీఐ నివేదిక వెల్లడించింది. వీరంతా పేపర్ లీక్ సూత్రధారులకు భారీగా డబ్బులు చెల్లించినట్లు వెల్లడించారు.
లీక్‌కు ప్రధాన సూత్రధారులు
గత వారం మూడో ఛార్జ్ షీట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఇందులో, పంకజ్ కుమార్ అనే వ్యక్తి సహకారంతో పరీక్షకు కొద్దిసేపటి ముందు నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్‌లోని ఓయాసిస్ స్కూల్‌లో పేపర్ లీక్ వ్యవహారం చోటు చేసుకుంది. పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ సహకారంతో ప్రశ్నాపత్రం బయటకు వెళ్లింది.
ప్రశ్నాపత్రం లీక్ తంతు ఎలా?
2024 మే 5వ తేదీ ఉదయం 8 గంటలకు పరీక్షా కేంద్రానికి ప్రశ్నాపత్రం వచ్చిందని సీబీఐ గుర్తించింది. హసనుల్ హక్ అనే కోఆర్డినేటర్, ఐఐటీ జెంషడ్‌పుర్‌కు చెందిన సివిల్ ఇంజినీర్‌ను క్వశ్చన్ పేపర్ బాక్స్ ఉన్న గదిలోకి పంపి, ప్రత్యేకమైన టూల్‌కిట్ సాయంతో బాక్స్‌ను తెరిచారు. ప్రశ్నాపత్రం ఫొటోలు తీసి, దానిని తిరిగి సీల్ చేశారు.
లీక్ అభ్యర్థులకు ప్రశ్నాపత్రం
ఈ ప్రశ్నాపత్రం ఫొటోలను ఓ గెస్ట్ హౌస్‌లో ఉన్న ఇతర వ్యక్తులకు పంపించారని సీబీఐ తెలిపింది. ఆ గెస్ట్ హౌస్‌లో తొమ్మిది మంది వైద్య విద్యార్థులు ఉన్నారని, వారు వెంటనే పేపర్‌కి సమాధానాలు తయారుచేసి తమ గ్యాంగ్ సభ్యులకు పంపినట్లు వెల్లడించింది. ఆ తర్వాత, డబ్బులు చెల్లించిన 144 మంది అభ్యర్థులకు ఆ ప్రశ్నాపత్రం చేరిందని సీబీఐ తెలిపింది.
సీబీఐ ఛార్జ్‌షీట్
ఈ కేసుకు సంబంధించి సీబీఐ 298 మంది సాక్షులు, 290 డాక్యుమెంట్లు, 45 మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా 5500 పేజీల ఛార్జ్ షీట్‌ను రూపొందించింది.