ఏపీ: బ్రెజిల్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక వేలంలో భారతీయ మూలాలున్న నెల్లూరు జాతి ఆవు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది.
వియాటినా-19 అనే ఈ ఆవును ఏకంగా 4.8 మిలియన్ డాలర్లకు (సుమారు ₹40 కోట్లు) ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. ఇది గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ నెల్లూరు ఆవు గంభీరమైన కండరాలతో, అరుదైన జన్యుపరమైన లక్షణాలతో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. దాని బరువు 1,101 కిలోలు ఉండగా, ఇతర ఆవులతో పోల్చితే రెట్టింపు బలంగా ఉంది.
అంతేకాదు, ఇది మిస్ సౌత్ అమెరికా అవార్డును గెలుచుకున్నప్పటితో పాటు చాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్ పోటీల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
నెల్లూరు ఆవులు భారతదేశంలో ఉద్భవించిన జాతిగా గుర్తింపు పొందాయి. వీటిని ఒంగోలు జాతిగా కూడా పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడంలో వీటి సామర్థ్యం ప్రత్యేకమైనది.
1800వ దశకంలో బ్రెజిల్‌కు ఈ ఆవులను ఎగుమతి చేయగా, ఇప్పుడు అవి ప్రపంచంలో అత్యంత ఖరీదైన జాతిగా గుర్తింపు పొందాయి.
వియాటినా-19 అత్యధిక ధరకు అమ్ముడవడం ప్రపంచవ్యాప్తంగా ఈ జాతిపై ఆసక్తిని మరింత పెంచింది. బ్రెజిల్‌లోని వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు ఈ నెల్లూరు ఆవుల వంశాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.