ఖాట్మండు: నేపాల్ ప్రధాని మరోసారి తన వ్యాఖ్యలతో వివాదం మొదలుపెట్టాడు. భారత్ మరియు నేపాల్ మధ్య విభేదాలకు కారణమైన కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్‌లను ఎలాగైనా తమ దేశంలో కలుపుకొంటామని పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో జనవరి 14న హిమాలయ దేశపు విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలి భారత పర్యటనకు రానున్న తరుణంలో ఈ మేరకు ఓలి వ్యాఖ్యలు చేశాడు.
నిన్న అనగా ఆదివారం ఆయన మాట్లాడుతూ, సుగౌలి ఒప్పందం ప్రకారం మహాకాళీ నదీ పరివాహక తూర్పు ప్రాంతంలో ఉన్న కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్ నేపాల్‌కు చెందుతాయి. భారత్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపి వాటిని మేము సొంతం చేసుకోనున్నాము అన్నారు. మా విదేశాంగ మంత్రి గురువారం అక్కడికి వెళ్తున్నారు. ఈ అంశంపైనే ఆయన చర్చిస్తారు. ఈ మూడు ప్రాంతాలను మా దేశంలో కలుపుతూ వెలువరించిన మ్యాపుల గురించి కూడా మాట్లాడతారు, అని తెలిపారు.
అలానే పొరుగు దేశాలైన భారత్, చైనాతో ద్వైపాక్షిక బంధం దృఢపరచుకునేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పుకొచ్చారు. సార్వభౌమత్వం కాపాడుకుంటూనే, సమానత్వ భావనతో స్నేహపూర్వక బంధాలు పెంపొందించుకుంటామని ఓలి పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో చైనాకు బాగా దగ్గరైన నేపాల్ ప్రధాని కేపీ ఓలి శర్మ, గత కొన్నినెలలుగా భారత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.