న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు (సీజే) రానున్నారు. వీరిలో నలుగురు సీజేలు బదిలీపై రానుండగా, ఐదుగురు న్యాయమూర్తులకు పదోన్నతి లభించింది. అలాగే మరో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు.
మొత్తంగా దేశవ్యాప్తంగా సీజేలు, న్యాయమూర్తులు కలిపి 14 మందికి బదిలీలు జరిగాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ సీజేగా బదిలీ అయ్యారు.
కాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి వస్తున్నారు, ఏపీ ప్రస్తుత సీజే అయిన జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అలాగే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, ఏపీ హైకోర్టుకు బదిలీపై రానున్నారు.