అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఉగాది లోపు కొత్త జిల్లాల నుండి కలెక్టర్లు మరియు ఎస్పీలు కార్యకలాపాలు నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి సన్నాహకాలు పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను సీఎంకు అధికారులు వివరించారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను అధికారులు సీఎం కు వివరించారు.
అలాగే ఇప్పటికే కొత్త జిల్లాల ప్రకటనల ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలను, సలహాలను, సూచనలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కాగా ఇప్పుడు ఉన్న కలెక్టర్లు, ఎస్పీలే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్న సీఎం, పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందని అన్నారు.
అలాగే స్థానిక సంస్థల విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా అన్నీ పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.