న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్‌ఫారం వాట్సాప్‌లో కొత్త నిబంధనలు, గోప్యతా విధానాల మార్పుల ఆందోళనల మధ్య మరో మెసేజింగ్ యాప్ సిగ్నల్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దేశీయంగా వాట్సాప్‌కు ప్రత్యర్థిగా దూసుకొస్తున్న సిగ్నల్ వినియోగదారులను తనవైపు తిప్పుకునేందుకు వాట్సాప్ తరహాలో ఈ ఫీచర్లను తన యూజర్ల సౌలభ్యం కోసం విడుదల చేసింది.
సిగ్నల్ యాప్ తాము ఎలాంటి యూజర్ డేటాను సేకరించమని ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిర్భయంగా వాడుకోవచ్చని సిగ్నల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రియాన్ ఆక్టన్ ప్రకటించారు. అతి తక్కువ సమయంలో తమకు లభించిన ఈ ఆదరణే దీనికి నిదర్శమన్నారు. సిగ్నల్ యూజర్ల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
వాట్సాప్ నూతన ప్రైవసీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో కోట్లాదిమంది వినియోగదారులు వాట్సాప్‌పై కోపంగా ఉన్నారు. ఫలితంగా ప్రత్యామ్నాయాలపై ప్రజలు దృష్టి మళ్లించారు. అందుబాటులో ఉన్న టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్‌లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ, తాజాగా వీటికి మైగ్రేట్ అవుతున్న క్రమంగా పెరుగుతోంది. వినియోగదారుల డేటాకు ఎలాంటి ఢోకా లేదు అని వాట్సాప్ హామీ ఇచ్చినప్పటికీ ఈ పరంపరం కొనసాగుతోంది.
వాబేటా ఇన్ఫో సమాచారం ప్రకారం తాజా బీటా నవీకరణలో, సిగ్నల్ క్రొత్త ఫీచర్లను విడుదల చేసింది, ఇది వినియోగదారులను చాట్ వాల్‌పేపర్‌ను మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు సిగ్నల్ యాప్‌లో అందుబాటులో లేదు. వాట్సాప్ మాదిరిగానే, సిగ్నల్ ఇప్పుడు స్టేటస్ అప్‌డేట్ ఫీచర్ ను తీసుకొచ్చింది.
గ్రూప్ ఇన్‌వైట్ లింక్ ద్వారా గ్రూపులలో చేరేందుకు, ఇతర సిగ్నల్ వినియోగదారులను ఆహ్వానించడానికి సిగ్నల్ ఇప్పుడు గ్రూప్ ఇన్‌వైట్ లింక్ యాడ్ ఫీచర్ ద్వారా సభ్యులను ఆడ్ చేయడానికి అనుమతిస్తుంది.