అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రేషన్ షాపుల వ్యవస్థను మెరుగుపర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమలు చేసిన విధానాలను రద్దు చేసి, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది లబ్దిదారులకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో రేషన్ సరుకుల పంపిణీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రవేశపెట్టగా, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని సవరించి, మళ్లీ రేషన్ షాపుల ద్వారా సరుకులను అందించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గతంలో కొన్న రేషన్ వాహనాలు ఇప్పుడు వృథా అవుతాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వాహనాలను తదుపరి ఏ విధంగా వినియోగిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా నిర్ణయం ప్రకారం, ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రతీ కిలోమీటర్‌కి ఒక రేషన్ షాపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దుకాణాలలో ఎక్కువ రకాల సరుకులు సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేషన్ షాపుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త నిర్ణయంతో కిలోమీటర్ పరిధిలో తక్కువ మందే ఉండటం వల్ల రేషన్ సరుకులు పొందడం సులభతరం అవుతుంది. దీని ద్వారా, రేషన్ సరుకులు పొందడానికి గడిపే సమయం కూడా తగ్గిపోవచ్చు.
మొత్తం 2,774 కొత్త రేషన్ షాపులను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి షాపుకు 400-450 రేషన్ కార్డులు, పట్టణ ప్రాంతాల్లో 500-550 కార్డులు, నగర ప్రాంతాల్లో 600-650 కార్డులు కేటాయించేలా ప్రణాళికలు రూపొందుతున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియ అక్టోబర్ 22లోపు పూర్తయ్యేలా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తోంది. అక్టోబర్ 22లోపు రేషన్ డిపోల్లో ఖాళీల భర్తీకి రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు జరిపి, అక్టోబర్ 28న దీపావళి సందర్భంగా రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం కావచ్చని సమాచారం.