హైదరాబాద్ : ఊహించినట్టుగానే తెలంగాణ లో గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) పోస్టులను రద్దు చేసేందుకు రూపొందించిన ‘ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్–2020’ను ఆమోదిస్తూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ‘ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ బిల్ –2020’ పేరుతో రూపకల్పన చేసిన కొత్త రెవెన్యూ చట్టానికి కూడా ఆమోదముద్ర వేసింది.
ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సోమవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలనలో కీలక సంస్కరణలకు సంబంధించిన బిల్లులు, ఆర్డినెన్స్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్స్‌లను త్వరలో అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెడతారు. భూములపై రైతులు, భూ యజమానుల హక్కులను పరిరక్షించడం, రెవెన్యూ శాఖలో విపరీతంగా పెరిగిన అవినీతి, అక్రమాలను రూపుమాపడం కోసం వీఆర్వో పోస్టుల రద్దుతో పాటు కొత్త రెవెన్యూ చట్టం బిల్లులను తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
వీఆర్వోల కారణంగానే గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులలో అవకతవకలు ఎక్కువయ్యాయని, ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులను మార్పులు చేశారని సర్వత్రా ఆరోపణలు ఉండటంతో ఈ పోస్టులను వెంటనే రద్దు చేయాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
మరో బిల్లు ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ బిల్–2002ని కూడా కేబినెట్ ఆమోదించింది. విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల జీతాలు, పెన్షన్లలో కొత విధించేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. అలాగే ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ –2020కు కేబినెట్ ఓకే చెప్పింది. ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్సు్క కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వయోపరిమితి 65 ఏళ్లకు పెరగనుంది.