గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ పెద్దగా సందడి చేయలేకపోయింది. మజాకా యావరేజ్ టాక్‌తోనే సరిపెట్టుకోగా, శబ్దం, అగత్యా డబ్బింగ్ సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు కొత్త శుక్రవారం రాబోయే సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నా, పెద్దగా హైప్ ఉన్న చిత్రాలు లేకపోవడం గమనార్హం.
ఈ వారం ఛావా లేట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్‌లో విజయం సాధించిన ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్‌కు ఏ మేరకు ఆదరణ లభిస్తుందో చూడాలి. మరోవైపు మలయాళ హిట్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా తెలుగు వెర్షన్‌గా థియేటర్లలో సందడి చేయనుంది.
జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన కింగ్స్టన్ సముద్రపు హారర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త కాన్సెప్ట్‌ను ఎక్స్‌ప్లోర్ చేస్తోంది. ఈ సినిమాకు మంచి ప్రమోషన్ జరుగుతోంది. అలాగే కన్నడ డబ్బింగ్ మూవీ రాక్షస, నారి, రారాజు, పౌరుషం లాంటి చిన్న సినిమాలు కూడా పోటీగా నిలుస్తున్నాయి.
ఇవి కాకుండా, మహేష్ బాబు – వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ-రిలీజ్ కూడా మంచి రిస్పాన్స్ పొందుతోంది. బుకింగ్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. కొత్త సినిమాల కంటే ఈ రీ-రిలీజ్ సినిమాకు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది.
ఇన్నేసి సినిమాలు విడుదలవడం బాగానే ఉన్నా, బాక్సాఫీస్‌పై నిలదొక్కుకోవాలంటే కంటెంట్ కచ్చితంగా ఆకట్టుకోవాలి. టాక్ బాగా వచ్చిన సినిమాలకు మాత్రమే వసూళ్లు భారీగా వస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.