గుండెపోటు ముప్పును 94 శాతం తగ్గించే సరికొత్త వాక్సిన్!
అమెరికా శాస్త్రవేత్తలు గుండెపోటు ముప్పును 94 శాతం తగ్గించే సరికొత్త ఔషధం ‘లెపొడిజిరాన్’ (lepodisiran)ను అభివృద్ధి చేశారు. ఈ టీకాను సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే, గుండె జబ్బులు దరిచేరవని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ ఔషధంపై తుది పరీక్షలు జరుగుతున్నాయని, దుష్ప్రభావాలు పెద్దగా లేవని వెల్లడించారు.
వంశపారంపర్య గుండె జబ్బులపై ప్రభావం
ఈ ఔషధం వంశపారంపర్యంగా వచ్చే గుండె జబ్బుల ముప్పును 94 శాతం తగ్గిస్తుందని, అలాగే పక్షవాతం ముప్పును కూడా గణనీయంగా తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ (Eli Lilly) ఈ మందును తయారు చేస్తోంది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇటీవల షికాగో యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో లెపొడిజిరాన్ ఔషధం పనితీరును శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (New England Journal of Medicine)లో ప్రచురితమయ్యాయి.
లెపొడిజిరాన్ పనిచేసే విధానం
రక్తంలో లిపోప్రొటీన్ (Lp(a)) స్థాయులు పెరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు తెలిపారు. 25 ఏళ్ల లోపు వయస్సులోనే గుండెపోటుకు గురయ్యే వారిలో ఈ లిపోప్రొటీన్ పాత్ర కూడా ఉంటుందని వారు వివరించారు. 1974లో గుర్తించిన ఈ ప్రొటీన్ వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని, జన్యువులే ఈ ప్రొటీన్‌ను నియంత్రిస్తాయని వైద్యులు చెబుతున్నారు. లెపొడిజిరాన్ ఔషధం ఈ ప్రొటీన్ స్థాయులను నియంత్రించడం ద్వారా గుండెపోటు ముప్పును దూరం చేస్తుందని, పక్షవాతం రాకుండా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు వివరించారు. వ్యాక్సీన్‌లాగా లెపొడిజిరాన్‌ను తీసుకుంటే, రక్తంలో లిపోప్రొటీన్ ఉత్పత్తిని ఈ మందు కట్టడి చేస్తుందని, తద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చని వారు పేర్కొన్నారు.