తిరువనసంతపురం: దేశంలోని కేరళ రాష్ట్రంలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కేరళలో రెండు నోరోవైరస్ కేసులను గుర్తించినట్లు తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ కొత్త వైరస్ సోకినట్లు తెలిపింది. అయితే ఈ వైరస్ పై అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కాగా ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజింజంలోని ఎల్‌ఎంఎస్‌ఎల్‌పీ స్కూల్‌లో ఫుడ్ పాయిజనింగ్, డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నారని తెలియడంతో వారి నుంచి నమూనాలు సేకరించామని మంత్రి తెలిపారు. నమూనాలను పరీక్ష కోసం రాష్ట్ర ప్రజారోగ్య ల్యాబ్‌కు పంపిమని, అయితే సదరు పరీక్షలో ఇద్దరికి నోరోవైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ పరిస్థితిని అంచనా వేసి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. కాగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు.