న్యూఢిల్లీ : భారత్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా లేదా రద్దు చేసే పరిస్థితి నెలకొంది. ఇందులో తాజాగా ఐపీఎల్ కూడా చేరింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరం ఐపీఎల్ మార్చ్ 29న మొదలవాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ సంవత్సరం ఐపీఎల్ విదేశాలలో నిర్వహించాలని భావిస్తోంది.
కాగా ఈ సంవత్సరం ఐపీఎల్ నిర్వహించే విషయమై బీసీసీఐ ఇప్పటికే సాధ్యసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం ఐపీఎల్ ను భారత్ లోనే నిర్వహించడం తమ మొదటి ప్రాధాన్యతగా బీసీసీఐ భావిస్తోంది. అయితే తమ ఆటగాళ్ళ ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒక వేళ భారత్ లో కరోనా వ్యాప్తి ఇప్పట్లో అదుపులోకి రాకుంటే ప్రత్యామ్నాయాల పై దృష్టి పెట్టింది. ఇందులో ఒకటి ఈ సంవత్సరం ఐపీఎల్ విదేశాలలో నిర్వహించే యోచనలో ఉంది. ఇందుకు ఇప్పటికే శ్రీలంక, యూఏఈ తమ ఆసక్తిని తెలియజేశాయి. ఇప్పుడు కొత్తగా న్యూజిలాండ్ కుడా ఈ జాబితాలో చేరింది. తమ దేశంలో కరోనా కేసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఐపీల్ కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధం అని ఒక ప్రకటనలో న్యూజిలాండ్ పేర్కొంది.
ఐపీల్ విదేశాలలో నిర్వహించడం బీసీసీఐకి ఇది కొత్తేమి కాదు. గతంలో 2009 లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో దక్షిణ ఆఫ్రికాలో నిర్వహించింది. తదుపరి 2014 లో కూడా సాధారణ ఎన్నికల వల్ల కొన్ని మ్యాచ్ లను యూఏఈ లో నిర్వహించింది. ఈ విషయమై ఒక బీసీసీఐ అధికారి ఈ విధంగా స్పందించారు: ‘ఆటగాళ్ళ భద్రత మా తొలి ప్రాధాన్యం, ఇందులో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఐతే ఐపీఎల్ నిర్వహించడానికి ఇప్పటికే యూఏఈ, శ్రీలంక తమ ఆసక్తిని తెలిపాయి, తాజాగా న్యూజిలాండ్ కూడా తమ ఆసక్తిని తెలిపింది. ఐతే మా తొలి ప్రాధన్యం ఐపీల్ భారత్ లోనే నిర్వహించడమే, ఈ విషయం అందరి భాగస్వామ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.