సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక ప్రపంచ్ టెస్ట్ చాంపియన్ షిప్ ప్రారంభానికి ఇంకొద్ది గంటలే మిగిలున్నాయి. జూన్ 18వ తేదీన భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ప్రారంభం కానుండగా, ఇంతలో కొందరు కివీస్ ఆటగాళ్లు కోవిడ్ నిబంధనలు మీరి గోల్ఫ్ క్రీడ ఆడేందుకు వెళ్లారని ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్ బజ్ ప్రచురించింది.
కాగా న్యూజిలాండ్ ఆటగాళ్ళైన బౌల్ట్, టిమ్ సౌథీ, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, ఫిజియో టామీ సిమ్సెక్ ఇవాళ బయో బబుల్‌ను దాటి బయటకు వెళ్లారని వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు బయో బబుల్ ప్రోటొకాల్స్ ను వీడి బయటకు వెళ్లి రావడం పట్ల భారత జట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూజిలాండ్ ఆటగాళ్ళు కచ్చితంగా బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్టేనని టీమిండియా మేనేజ్‌మెంట్ వాదిస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు కూడా చేయనున్నట్లు తెలిపింది. కానీ ఈ విషయంలో న్యూజిలాండ్ వాదన మాత్రం ఇంకోలా ఉంది. హోటల్ మరియు గోల్ఫ్ కోర్సు ఒకటే ప్రాంగణంలో ఉన్నాయని అందుకే తమ ఆటగాళ్లు గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని, ఇది బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఏ మాత్రం ఉల్లంఘించినట్లు కాదని జట్టు మేనేజ్‌మెంట్ వాదిస్తోంది.
ఇదిలా ఉంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్, న్యూజిలాండ్ జట్లు మంగళవారం తమ జట్టు తరఫున ఆడే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాయి. రెండు జట్ల ఆటగాళ్లు సౌతాంప్టన్‌లోని ఒకే హోటల్‌లో బస చేస్తున్నారు.