సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో మూడవ రోజు న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ కు భారత్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. సీమర్ కైల్ జేమీసన్ (5/31) కు కలిసొచ్చిన పిచ్‌పై నిప్పులు చెరగడంతో భారత్ వికెట్లు త్వరగా పడ్డాయి. ఆదివారం తొలి సెషన్‌లోనే భారత్ పతనం అంచున నిలిచింది.
కాగా రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ తొలి ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద తెర పడింది. రహానే (190 బంతుల్లో 49; 5 ఫోర్లు), కోహ్లి (196 బంతుల్లో 44; 1 ఫోర్) రాణించారు. బౌల్ట్, వాగ్నర్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. తరువాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి బలంగా నిలబడింది.
ప్రస్తుతం న్యూజిలాండ్ 116 పరుగులు వెనకబడి ఉంది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఆడుతున్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్ దక్కింది. మూడో రోజు ఆట మొదలవగానే భారత్ ను గట్టిదెబ్బ తీశాడు జేమీసన్. ఓవర్‌నైట్ స్కోరుకే కెప్టెన్ కోహ్లి పెవిలియన్ చేరాడు.
ప్రత్యర్థి బౌలర్లు నిప్పులు చెరగడంతో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అంటూ ఎవరూ మిగల్లేదు. బ్యాటింగ్ సామర్థ్యమున్న జడేజా (15), అశ్విన్ (22)ల ఆట స్కోరును 200 పరుగుల దాకా తీసుకొచ్చిందేగానీ, గట్టి భాగస్వామ్యానికి బాటలు వేయలేకపోయింది. సౌతీ తెలివైన బంతితో అశ్విన్‌ను పడేయగా, 211/7 స్కోరు వద్ద భారత్ లంచ్‌కు వెళ్లింది.
పిచ్ పరిస్థితిని గుర్తించిన కివీస్ ఓపెనర్లు లాథమ్, కాన్వే జాగ్రత్తగా ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు వందేసి బంతుల్ని ఎదుర్కొన్నారు. లాథమ్ (104 బంతుల్లో 30; 3 ఫోర్లు)ను ఎట్టకేలకు అశ్విన్ పడేయడం కోహ్లి సేనకు కాస్త ఊరట నిచ్చింది. మరోవైపు ఓపెనర్ కాన్వే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా, జట్టు స్కోరు వంద దాటింది. మరికాసేపటికే ఇషాంత్… కాన్వేను ఔట్ చేయడంతో 101 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది.