హైదరాబాద్: కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రం కొంచెం మెరుగ్గా ఉందని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. కాగా 90 శాతం మంది మాస్కులు విధిగా ధరిస్తున్నారని ఆయన అన్నారు.
భూమి మీద ఇలాంటి విపత్తులు వంద ఏళ్లకొకసారి వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే 3,4 వారాలు చాలా కీలకం అని, ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా పై హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడారు.
త్వరలొ రానున్న పెళ్లిళ్ల సీజన్ పట్ల కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే 45 లక్షల మంది పైగా వాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. ఇంకా మిగతావారికి కూడ విడతలవారీగా వాక్సిన్ అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కోవిడ్ లక్షణాలు ఉంటేనే కోవిడ్ ఉన్నట్టని, భయంతో అనవసరంగా పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరవద్దని కోరారు. లక్షణాలు ఉన్నవారు పరీక్షలకు దూరం అవుతున్నారు. కోవిడ్ లేని వారు పరీక్షల కోసం వచ్చి వ్యాధి తెచ్చుకుంటున్నారని వివరించారు. లక్షణాలు కేవలం రెండు మూడు రోజులు ఉంటాయని, తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.