అనంతపురం: తెలుగు రాష్ట్రాళ మధ్య ఉన్న ఎన్హెచ్ 44 ఇక త్వరలో సూపర్ హైవేగా మారనుంది. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి–44 త్వరలో ఒక సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారబోతోంది.
దీని వల్ల ట్రాఫిక్ క్లియరెన్స్ సమయంతో పాటు ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని డిజిటల్ బోర్డుల ద్వారా ప్రదర్శించేలా ఈ జాతీయ రహదారిని ఆధునికంగా మార్చడానికి భారత కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంచనాలను తయారు చేసింది.
కాగా ఈ ప్రపోజల్ అతి త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు రానుంది. దీనికి సంబంధించిన సర్వే ఈ పాటికే మొదలైంది. ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసలను ఆరు వరుసల రహదారిగా విస్తరిస్తారు. రహదారికి ఇరువైపులా ఏడు మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్లు నిర్మించేందుకు కూడా ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ఈ జాతీయ హైవే ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సరిహద్దు నుండి కర్ణాటక సరిహద్దు వరకు 251 కిలోమీటర్లు వ్యాపించి ఉంది. ఢిల్లీ –ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే మాదిరిగానే ఈ హైదరాబాద్ మరియు బెంగళూరు రహదారిని పూర్తి స్థాయిలో రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేయడానికి ప్రణాళిక సిద్ధం అవుతోండి.
అధునాతన టెక్నాలజీతో రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానం చేయగానే జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఒక విభాగం ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది.