అమరావతి: కరోనా మహమ్మారి దాదాపుగా అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ప్రజలు నిత్యావసరాలకు సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్ళే పరిస్థితి లేదు.
లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో సూపర్ మార్కెట్లు తెరిచినా తక్కువ సమయం మాత్రమే అనుమతిస్తున్నారు, ఒక వేళ వెళ్ళినా జనం ఎక్కువ ఉంటారనో, లేక నిబంధనలు ఎక్కువ ఉంటున్నందున ప్రజలు అలాంటి చోట్లకు వెల్లడానికి బయపడుతున్నారు.
ఇప్పుడు వీరందరికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయం గల్లీ కొట్లు. ఇళ్ళకు దగ్గర్లో ఉండడం, అన్నీ అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశం. ఎక్కువ దూరం వెళ్ళకుండ, ఎక్కువ ప్రజలతో కలవకుండా కావల్సినవి కొన్నుక్కునే అవకాశం ఉంటుంది.
ఈ సమయంలో గల్లీ కొట్లు వినియోగదారులకు అన్ని వస్తువులు అందుబాటులో ఉంచుతూ మంచి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. నీల్సన్ కంపెనీ చేసిన సర్వే ప్రకారం జనవరి నుంచి మే నెల వరకు వ్యాపారాలు బాగా నష్టాలు చవిచూసాయి.
అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత జూన్ నెల నుండి వ్యాపారాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆ కంపెనీ సర్వే ప్రకారం ఇప్పుడు వ్యాపారాలు లాక్ డౌన్ ముందు స్థాయి కి దాదాపుగా చేరువలో ఉన్నాయి. ఇది భారత దేశ అర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే విషయంగానే పరిగణించాలి అంటున్నారు నిపుణులు.