అమరావతి: ఏపీ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, దానిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం మే 1 నుండి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే, అయితే ఇది ఉచితం కాదు అని తెలిపింది.
కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 18 ఏళ్ళు నిండిన వారికి ఇచ్చే ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. విపత్కర సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ లెక్క ప్రకారం రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. ఏపీ సర్కార్ వీరందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనుంది.
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, ‘‘కరోనా కట్టడిపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ప్రజల భాగస్వామ్యంతో పాటు వాక్సినేషన్ కూడా ముఖ్యమని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్నాం. 18-45 వయసు ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ ను ఉచితంగా వేస్తాం. ఇందుకు గాను 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం అని తెలిపారు.
కాగా రోజురోజుకు కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం వ్యాప్తిని తగ్గించడానికి రేపటి నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సీటీ స్కాన్ పేరు చెప్పి దోపిడీ చేయడంపై కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని తెలిపారు. దీనికి 2,500 రూపాయల ధర నిర్ణయించాం.
ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తగా మాస్క్, భౌతిక దూరం వంటి కోవిడ్ నియమాలను పాటించాలని ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని సీఎం జగన్ కోరారు. కళ్యాణ మండపాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని కూడా ఆదేశించారు. బెడ్స్, కోవిడ్ రిక్రూట్మెంట్ కూడా పెంచుతున్నాం. జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లకు జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని కోరాము అని మంత్రి తెలిపారు.