మూవీడెస్క్: నిర్మాతగా నిహారిక పాట్లు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక ఈసారి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తన కొత్త సినిమా ‘కమిటీ కుర్రాళ్ళు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా ఆగష్ట్ 9న విడుదల కానుండటంతో, ప్రమోషన్ విషయంలో నీహారిక పూర్తిగా తానై సమర్థవంతంగా వ్యవహరిస్తోంది.
కొత్త నటులతో తెరకెక్కిన ఈ విలేజ్ డ్రామా మీద ఇప్పటివరకు పెద్దగా అంచనాలు లేకపోవడంతో, ఈ సినిమాకు కావలసిన గుర్తింపు తెచ్చేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తోంది.
సినిమా ప్రమోషన్ కోసం నీహారిక ఒక సరికొత్త ప్రణాళికపై దృష్టి సారించింది. జనసేన పార్టీకి చెందిన 21 నియోజకవర్గాల్లో, బాబాయి పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక ప్రీమియర్లను చూపించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాలని యూనిట్ లో చర్చ జరుగుతోందని సమాచారం.
ఈ విధానం ద్వారా మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన కార్యకర్తల మద్దతు కూడగడతామని టీమ్ ఆశిస్తోంది. ఇక సినిమా ఈవెంట్ విషయంలో కూడా నీహారిక పెద్ద ప్లాన్ చేస్తోంది.
రామ్ చరణ్ లేదా చిరంజీవిని ముఖ్య అతిథులుగా తీసుకురావడం ద్వారా ప్రమోషన్ మరింత పెంచాలని అనుకుంటోంది.
సినిమాకు కేవలం ఒక వారం మాత్రమే థియేట్రికల్ రన్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, మొదటి వారం వసూళ్లపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఆగస్ట్ 15కి మరిన్ని భారీ విడుదలలు ఉన్నందున, ఈ వారం అత్యధిక వసూళ్లు సాధించడం టీమ్ లక్ష్యం. ‘కమిటీ కుర్రాళ్ళు’ మంచి హిట్ అయితే, ఈ విజయాన్ని ఆశ్రయించి, నిహారిక తన ప్రొడక్షన్ హౌస్‌లో మరిన్ని చిన్న బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించడానికి ముందుకు వస్తుందని తెలుస్తోంది.
కొత్త టాలెంట్ కి అవకాశం ఇవ్వడమే తన ధ్యేయమని, నిహారిక ఈ సినిమాతో మళ్లీ రుజువు చేయాలని చూస్తోంది. మరి ‘కమిటీ కుర్రాళ్ళు’ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.