అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాల్సిందిగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ చీఫ్ సెక్రటరీ కి ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. అయితే, హైకోర్టు సూచన మేరకు ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశమై వినతి పత్రం సమర్పించారు.
తాజాగా ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుని నిమ్మగడ్డ రమేష్ ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ గా పునర్నియమించాలని ఆదేశించారు.
ఈ విషయంలో గవర్నర్ ఏపీ సర్కార్ కి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.
మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో,ఎల ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.