విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎలెక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కడప జిల్లా పర్యటన ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సోమవారం సంబంధిత జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆయనకు కంటి సమస్య కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు.
కంటి పరీక్షల కోసం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి నిమ్మగడ్డ వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
మావోయిస్టు ప్రభావం ఎక్కువన్న ప్రాంతాల మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రి 7.30 గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది.