టాలీవుడ్: కరోనా కారణంగా మర్చి నుండి ఇప్పటివరకు సినిమాలేవీ విడుదల కాలేదు. షూటింగ్ మధ్యలో ఉన్నవి, షూటింగ్స్ మొదలవ్వని సినిమాల పరిస్థితి అలాగే ఉంది కానీ షూటింగ్ ముగించుకొని విడుదలకి సిద్ధం ఉన్న సినిమాలకి మాత్రం థియేటర్లు తెరుచుకునే వరకు వేచి చూడాలా లేక ఓటీటీ లో విడుదల చెయ్యాలా అన్న మీమాంస లో ఉన్నారు ప్రొడ్యూసర్స్. మొన్నటి వరకు థియేటర్ తప్ప ఎక్కడ విడుదల చెయ్యబోము అని చెప్పిన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడప్పుడే పరిస్థితి చక్కబడే సూచనలు కనబడక పోవడంతో ప్రొడక్షన్ భారం మోయలేక ఓటీటీలకి అమ్మేస్తున్నారు.
షూటింగ్ ముగించుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాల్లో ఒకటి అనుష్క, మాధవన్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సూచనలు కనపడుతున్నాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన కోన వెంకట్ ఈ విషయం పైన ట్విట్టర్ లో ఒక పోల్ కండక్ట్ చేసారు. ”మీరు థియేటర్ల కోసం జనవరి లేదా ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే. ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఏ వేదికపై చూడాలనుకుంటున్నారు” అని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే మేకర్స్ ఓటీటీ విడుదలకు సిద్ధపడుతున్నట్టు అర్థం అయింది. దీనికి తగ్గట్టే ట్విట్టర్ పోల్ లో 56 % ఓటీటీలో రిలీజ్ చేయమని, 29 % థియేటర్స్ లో రిలీజ్ చేయమని, మిగతా వారు ఎక్కడైనా పర్వాలేదని చెప్పారు.
ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. తమిళ తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిభోట్ల, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. పూర్తిగా విదేశాలలో షూటింగ్ జరుపుకున్న ‘నిశబ్దం’ మూవీ చాలా వాయిదాల అనంతరం ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే కరోనా వచ్చి ఈ సినిమా ఇంకా ఆలస్యం అయింది. ప్రస్తుత పరిస్థితులని చూసి ఇంకా ఆలస్యం చేసే ఉదేశ్యం లేక ఓటీటీ ల బాట పట్టినట్టు కనిపిస్తుంది.