ముంబై: షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో విమెన్స్ టీ20 2020 టైటిల్ విజేతగా ట్రైల్ బ్లేజర్స్ నిలిచింది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫైనల్ పోరులో ఎవరు గెలిచినా ఆ విజయం మాత్రం ఎంతోమంది ఔత్సాహిక మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆమె భారతదేశంలో మహిళల క్రికెట్‌కు రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నీతా అంబానీ ఇన్‌స్టాలో సోమవారం ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రతి రంగంలో, ముఖ్యంగా క్రీడా, విద్యా రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలని, వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నీతా అభ్యర్థించారు.
దీని కోసం తమ ఫౌండేషన్ తరపున బాలికలు అందరికీ విద్య, క్రీడా అవకాశాలు అందించాలనేదే తన లక్ష్యమని చెప్పారు. మౌలిక వసతులు, సదుపాయాలతోపాటు, అవకాశాలు, నైపుణ్య శిక్షణ చాలా అవసరమన్నారు. ఈ విషయంలో తమ ఫౌండేషన్ చాలా కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో దేశానికి 33 మందితోపాటు, 12 మంది విదేశీ మహిళా క్రికెటర్లు జియో విమెన్ 2020లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.