
టాలీవుడ్ : టాలీవుడ్ హీరో నితిన్ ఈ సంవత్సరం చెక్ సినిమా తర్వాత రంగ్ దే అనే మరో ఫామిలీ ఎంటర్టైనర్ తో సినీ అభిమానుల్ని పలకరించాడు. కీర్తి సురేష్ కాంబినేషన్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
సినిమా మొదలవడం హీరో చిన్నతనం నుండి మొదలవుతుంది. తన ఐదవ ఏట తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అని అనుకున్న వెంటనే పక్క ఇంట్లోకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది. అలా ఫ్యామిలి ఫ్రెండ్స్ గా మొదలైన హీరో హీరొయిన్ కథ పెళ్లి చేస్కునే వరకు వెళ్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది మిగతా సినిమా. ఈ సినిమా కథ విషయానికి వస్తే పక్క పక్క ఇళ్లలో ఉండే హీరో , హీరోయిన్లు వాళ్ళ మధ్య గొడవలు, ప్రేమ లాంటి ఎమోషన్స్ చూస్తే నువ్వే కావలి , తమ్ముడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కథ విషయం కొత్తగా చెప్పుకోవడానికి ఏమి లేదు. కథనం విషయం లో కూడా సినిమాలో పెద్దగా సర్ప్రైజెస్ ఏమి ఉండవు. కానీ భావోద్వేగాల్ని స్క్రీన్ పైన ప్రెసెంట్ చేయడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. వెంకీ అట్లూరి తనకి కలిసి వచ్చిన లవ్, బ్రేకప్, లవ్ అనే కాన్సెప్ట్ నే మళ్ళీ రిపీట్ చేసాడు.
సినిమా కథ పాతదే అయినా సినిమాలో వచ్చే సీన్స్ లో ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ లో హీరో స్నేహితులతో కామెడీ సీన్స్, బ్రహ్మాజీ తో ఉండే చిన్న ఎపిసోడ్స్, సెకండ్ హాఫ్ లో వెన్నెల కిశోర్ తో కామెడీ తో ప్రేక్షకులని బాగానే ఎంగేజ్ చేసాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్స్ మధ్య గిల్లి కజ్జాలు, కొన్ని కామెడీ సీన్స్ తో వెళ్లిన సినిమా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ లో హీరో మారిపోవడానికి ఇంకా బలమైన సీన్స్ పడుంటే సినిమా ఇంకొక రేంజ్ లో ఉండేది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఎదో ఫ్లో లో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఒక బలమైన ఎమోషన్ ఐతే ప్రేక్షకుడు ఫీల్ అవలేడు.
టెక్నిషియన్స్ విషయానికి వస్తే డైరెక్టర్ తన పాత సినిమాల్లాగే ఒక రొటీన్ రొమాంటిక్ ఫామిలీ ఎంటర్టైనర్ ని సేఫ్ ప్రాజెక్ట్ లాగా రూపొందించాడు. ఈ సినిమాలో నటీనటుల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాని తమ భుజాలపై మోశారు. దేవి సంగీతం ప్రతీ స్టేజ్ లో ఆకట్టుకుంది. సినిమా డౌన్ అవుతుంది అనుకున్న ప్రతి సారి దేవి సంగీతం తో ఆకట్టుకున్నాడు. బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించాడు. పి.సి.శ్రీరామ్ పని తనం వల్ల ప్రతీ సీన్ ఎంతో కలర్ ఫుల్ గా చూడ చక్కగా ఉంటుంది. ఈ సినిమా పేరుకు తగ్గట్టే ఈయన ప్రతీ సీన్ ని కలర్ఫుల్ గా చూపించాడు.
నటీనటుల్లో నితిన్ సెట్టిల్డ్ పెర్ఫార్మన్స్ అందించాడు. తన వరకు గొప్పగా చెప్పుకోకపోవడానికి ఏమి లేకపోయినా కూడా పాత్ర స్కోప్ వరకు బాగానే చేసాడు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్ర కీర్తి సురేష్. ఒక స్టేజ్ లో కీర్తి యాక్టింగ్ హీరోని డామినేట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మామూలుగానే అనిపించినా సెకండ్ హాఫ్ లో కీర్తి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లో తన ప్రత్యేకత చాటుకుంది. మరో సీనియర్ నటి రోహిణి హీరోయిన్ తల్లి పాత్రలో ఆకట్టుకుంది. సీనియర్ హీరో నరేష్ కూడా తండ్రి గా కీలకమైన పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాలో ప్రేమ దేశం వినీత్ ఒక ప్రత్యేక పాత్రలో ఉంటాడు కానీ అంతగా చెప్పుకునే పాత్ర ఏమి కాదు. హీరోయిన్ తల్లి కౌసల్య, హీరో ఫ్రెండ్స్ సుహాస్, అభినవ్, వెన్నల కిశోర్ మరియు మరో పాత్రలో బ్రహ్మాజీ తమ పాత్రల వరకు మెప్పించారు.
ఓవరాల్ గా చెప్పాలంటే విజువల్స్ లో ఉన్న కలర్స్ సినిమా కథలో ఉంటే సినిమా ఇంకా కలర్ఫుల్ గా ఉండేది.