అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి చాలా అనుకూల పరిస్థితులున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన బెంజి సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్‌లను జాతికి అంకితం చేయడంతో పాటు రాష్ట్రంలో రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు భూమి పూజ, శిలాఫలకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.
శుక్రవారం నాగపూర్ నుంచి గడ్కరీ, ఢిల్లీ నుంచి కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ జనరల్ వీకే సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చేసిన పలు ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే పనులు నాలుగు జిల్లాలలో కొనసాగుతాయన్నారు. అదే విధంగా విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు కూడా చేపడదాం. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి సీఎం జగన్ ను ఢిల్లీకి రమ్మని అన్నీ అక్కడ చర్చిద్దాం అని గడ్కరీ అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నితిన్ గడ్కరీ నేతృత్వంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి. కనకదుర్గ ఫ్లై ఓవర్ వల్ల విజయవాడలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తొలగిపోతుంది అని అన్నారు.