అమరావతి: ఏపీ లో రాగల 12 గంటల్లో ‘నివార్’ తీవ్ర తుపానుగా మారనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఈ రోజు తెలిపింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంలో 370 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది.
25వ తేదీ మంగళవార సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ నివార్ తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు మరియు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. ముందస్తుగా సహాయక చర్యల కోసం నెల్లూరు జిల్లాకు 2 ఎస్డీఆర్ఎఫ్, 1 ఎన్డీఆర్ఎఫ్.. చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు విపత్తుల శాఖ తెలిపింది.
బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తీర,లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు పేర్కొన్నారు.