విజయవాడ: మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ లేదని, కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా.అమరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. కేరళ, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ ఉందని, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
అందువల్ల ఏపీ ప్రజలు నిరభ్యంతరంగా చికెన్ తినవచ్చని తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించామని, పౌల్ట్రీ పరిశ్రమ పరిశ్రమ కూడా అప్రమత్తంగానే ఉందన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ “ఏపీలో ఏటా సుమారు లక్షకు పైగా పక్షులు వలస వస్తుంటాయి. కొల్లేరు, పులికాట్, నేలపట్టు, కోరంగి ప్రాంతాలకి పక్షులు ఎక్కువ వలస వస్తుంటాయి.
ఇలా వలస వచ్చే పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ, వైద్య ఆరోగ్య శాఖలతో కలిసి పర్యవేక్షణ చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ లక్షణాలతో పక్షులు, కోళ్లు చనిపోతే మా దృష్టికి తీసుకురావాలని అటవీ శాఖని కోరాం అని తెలిపారు. ఏవైనా కేసులు వస్తే భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. పరిస్ధితులను బట్టి జిల్లా స్ధాయిలో కలెక్టర్ల అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం” అని అమరేంద్ర కుమార్ తెలిపారు.