హైదరాబాద్: వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అధికారులు కొన్ని కీలక మార్పులు చేశారు. వ్యాక్సిన్ వేసే జాబితాలో పేరుండీ నిర్దేశిత రోజున వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే వారికి ఇంకోసారి టీకా వేసే అవకాశం ఇవ్వకూడదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవడానికి కేటాయించినరోజు రాకపోతే, అందుబాటులో ఉన్న ఇతర అర్హులైన వారికి వేయాలని, తద్వారా వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు.
తొలిదశలో వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చాలాచోట్ల ఆరోజు నిర్దేశించిన జాబితాలోని వారందరూ రావడంలేదు. కొన్నిచోట్ల 60 శాతం, మరి కొన్నిచోట్ల 70 శాతం మంది టీకాలకు వస్తున్నారు. మరికొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి తిరస్కరిస్తున్నారు. దీంతో నిర్ణీత తేదీన వేయాల్సిన వ్యాక్సిన్ టార్గెట్ పూర్తి కావడం లేదు.
దీని వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఉదాహరణకు ఈ నెల 19న 73,673 మంది లబ్ధిదారులను లక్ష్యంగా నిర్దేశించగా 51,997 మందికే టీకాలు వేశారు. అంటే ఆరోజు వేయాల్సినవారిలో ఇంకా 21,676 మంది రాలేదు. అందుకే ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
వ్యాక్సిన్ వేసే కేంద్రంలో రోజుకుఎంతమందికి టీకా వేయాలన్న వివరాల జాబితా సంబంధిత అధికారి వద్ద ఉంటుంది. కోవిన్ యాప్‌లో అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఎవరెవరికి ఎప్పుడు వేయాలో తేదీ, టైం స్లాట్ ప్రకారం లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వెళ్తాయి. ఆ ప్రకారం లబ్ధిదారులు వస్తారు. ఇది సాధారణంగా జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియ. అయితే, చాలామంది గైర్హాజరుకావడం వల్ల లక్ష్యం నెరవేరడంలేదు.
కాబట్టి ఎవరైనా కరోనా టీకా వేసుకోబోమని తిరస్కరిస్తున్నట్లు చెబితే, దాన్ని కోవిన్ యాప్‌లో నమోదు చేస్తారు. అలా ఒకసారి తిరస్కరిస్తున్నట్లు యాప్‌లో నమోదైన తర్వాత మరోసారి వారికి టీకాలు వేసే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. యాప్‌ను ఆ విధంగా తీర్చిదిద్దుతారని చెబుతున్నారు.