నిడమనూరు: తెలంగాణలో సాగర్ లో ఎన్నికల వేళ రెండు గ్రామాలు నిరసన తెలుపుతున్నాయి. ఇంత వరకు మా ఊరిలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఏ రాజకీయ నాయకులు ఓట్ల కోసం మా ఊరిలోకి రావద్దండి అంటూ నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని గగ్గినపల్లివారిగూడెం మరియు కమ్మరిగూడెం ప్రజలు ఊరి మొదట్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ రెండు గ్రామాలు వేంపాడ్ గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తాయి. ఆదివారం వేంపాడ్‌లోని ప్రధాని రహదారి వెంట ఆ ఊరి ప్రజలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా ఈ గ్రామాలు ఉప ఎన్నిక జరుగనున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో గ్రామస్తుల నిరసనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇక్కడ ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్) ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే.