అమరావతి: ఏపీ లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టిందని, ఇందుకు ప్రజలు పూర్తిగా సహకరించాలని ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల సందర్భంగా ఆయన కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నిబంధనల్ని పౌరులంతా ఖచ్చితంగా పాటించాలని కోరారు.
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతమవుతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించడంతో కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. కరోనా నియంత్రణకు సంబంధించిన నియమాలను ప్రజలకు తెలియజేసేలా నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో మాస్కులు ధరించని వారికి, కోవిడ్ నియమావళిని పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.
కాగా ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, నిత్యావసర సరుకులు, అత్యవసరాల కోసమే బయటకు వెళ్ళాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. వేడుకలు, విందులు, వినోదాలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవడం, వీలైతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు.
అలాగే ప్రజలౌ బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటించటం వంటివి విధిగా పాటించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో కూడా భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని, విద్యార్థులు కోవిడ్ నియమాలు తప్పకుండా పాటించేలా చర్యలు చేపట్టాలని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యాసంస్థల అధికారులకు సూచించారు.
శనివారం పోలీసు వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కులు ధరించని 18,565 మందికి రూ.17,33,785 జరిమానా విధించినట్టు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. విశాఖపట్నం లో 1,184 మందికి రూ.1,16,700, తూర్పు గోదావరి జిల్లాలో 2,299 మందికి రూ.1,78,050, విజయవాడలో 2,106 మందికి రూ.1,93,850, గుంటూరు అర్బన్‌లో 844 మందికి రూ.1,05,720 జరిమానా విధించారు.