పనిచేసే సమయాల్లో నిద్ర మత్తు వచ్చి, పనితీరుపై ప్రభావం చూపుతుందా? మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత లేదా ఇతర సమయంలోనూ శరీరం అలసిపోతున్నట్లు అనిపిస్తే, ఈ సమస్య తలెత్తడానికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో, దానివెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం.
స్లీప్ అప్నియా: ఈ సమస్యకు ప్రధాన కారణం స్లీప్ అప్నియా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్లీప్ అప్నియా అనేది తీవ్రమైన స్లీప్ డిజార్డర్, దీనిలో శ్వాస పదేపదే ఆగిపోయి ప్రారంభమవుతుంది. మీరు బిగ్గరగా గురక పెట్టే వారయితే మరియు పూర్తి నిద్ర తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే, మీకు స్లీప్ అప్నియా ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణం ఊబకాయం.
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం:
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం కూడా మీ నిద్రలేమికి కారణం కావొచ్చు. రాత్రి భోజనం చేసిన 3 నుండి 4 గంటల తర్వాత నిద్రపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, లేట్ నైట్స్ భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగక, శరీరంలో సమస్యలు తలెత్తుతాయి.
ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం:
వీడియోలు చూడటం, మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడం కూడా నిద్ర మీద ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో వీటిని తక్కువ వెలుతురులో ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెదడు శ్రమ పడుతుంది.
సరైన నిద్రా అవసరం:
నిద్ర లక్షణాలు కూడా ముఖ్యమైనవి. రాత్రిపూట శరీరానికి అవసరమైన 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం. పడుకునే ముందు గదిలో వెలుతురు లేకుండా చూసుకోవడం మంచిది. దీని వల్ల మీకు నిద్ర గాఢంగా పడుతుంది.
ఆల్కహాల్ వినియోగం:
అతిగా ఆల్కహాల్ సేవించడం నిద్రలేమికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి నిద్ర రానీయకపోగా, మరిన్ని ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుంది.
కాఫీ, టీలు రాత్రిపూట వద్దు:
రాత్రిపూట కాఫీ, టీలు తీసుకోవడం వల్ల నిద్ర రాదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే కెఫిన్ మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
ఆరోగ్యవంతమైన నిద్ర కోసం చిట్కాలు:
- రాత్రిపూట పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.
- పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగితే హాయిగా నిద్ర పడుతుంది.
- రోజుకు 6 నుండి 8 గంటల నిద్రపోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తిని పొందవచ్చు.