అమరావతి: జీబీఎస్‌పై ఆందోళన అవసరం లేదు – ఏపీ ప్రభుత్వం
గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) సాధారణంగా కనిపించే వ్యాధేనని, ఎవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు.
గుంటూరు జీజీహెచ్‌లో జీబీఎస్‌తో చేరిన ఏడుగురిలో ఇద్దరు పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారని, మిగతావారికి సైతం మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంటీ కృష్ణబాబు బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పదిమంది జీబీఎస్‌తో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా నరాల బలహీనత, పాదాల నుంచి పైకి విస్తరించే చచ్చుబడి, శ్వాసకోశ సమస్యలుగా కనిపిస్తుందని చెప్పారు.
జీబీఎస్ లక్షకు ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే కనిపించే అరుదైన వ్యాధి అని, అనవసరమైన భయాలు వద్దని సూచించారు. పుణెలో ఒకే ప్రాంతంలో 140 మందికి పైగా ఈ వ్యాధి సోకిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనం నిర్వహిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించగా, అసాధారణంగా పెరిగిన కేసులు లేవని తేలిందని తెలిపారు.
ప్రభుత్వం బాధితులకు అత్యంత ఖరీదైన ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు అందిస్తున్నదని, ఒక్కొక్కరికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వ్యయం చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వ్యయాన్ని లెక్కచేయకుండా ఉత్తమ వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.