ఏపీ: దేశ రాజకీయాల్లో ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వాలు కొలువు తీరడం తాజా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాకు అర్హత పొందలేకపోయింది.
ఇదే పరిస్థితి మహారాష్ట్రలోనూ పునరావృతమైంది, అక్కడ మహా వికాస్ అఘాడీ కూటమిలోని ఏ ఒక్క పార్టీకి 10% సీట్లు రాలేదు.
288 అసెంబ్లీ స్థానాల్లో 29 సీట్లు అవసరం ఉండగా, శివసేన(యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ 10 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి.
ఈ పరిస్థితి దేశంలో వేరే రాష్ట్రాల్లో కూడా గమనించవచ్చు. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలు పని చేస్తున్నాయి.
గుజరాత్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇది ప్రజల ఓటింగ్ విధానంలో వచ్చిన మార్పును సూచిస్తోంది.
ప్రజలు ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చి, ప్రతిపక్ష పాత్రను మరుగున పడేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచివి కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రతిపక్షం లేనప్పుడు ప్రభుత్వాలను సమర్థవంతంగా ప్రశ్నించే అవకాశం తగ్గిపోతుంది. ప్రతిపక్ష పాత్రను ప్రజలు గుర్తించి, తమ ఓటుతో సమతౌల్యాన్ని కల్పించడం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.