లక్నో: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ప్రతాపం చూపిస్తోంది. దేశ మొత్తంగా కోవిడ్ కేసులు, మరణాలు భారీ స్థాయిలో పెరిగాయి. మహమ్మారిని అరికట్టేందుకు లాక్డౌన్, కర్ఫ్యూ వంటి చర్యలతోపాటు అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే ముఖ్యమైన ఆయుధమని వైద్య నిపుణులు సూచిస్తున్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా మంది ఇంకా భయంతో ముందుకు రావడం లేదు. ఈ తరుణంలో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వాటిలొ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్లు ఖచ్చితంగా తీసుకునేలా చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో జిల్లాలన్నింటిలో ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, లేకుంటే వాళ్లు వారి నెల జీతం పొందలేరని బుధవారం ఫిరోజాబాద్ అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్..’నో వ్యాక్సిన్ నో శాలరీ’కి సంబంధించి ఆదేశాలను జారీ చేశారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల లిస్టును సిద్ధం చేయాలని, అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు.
సదరు ఉద్యోగులు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే ఆ ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసకుంటుందని, వారి జీతాన్ని కూడా నిలిపివేస్తుందని జిల్లా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ తెలిపారు. అయితే టీకా తీసుకోని ఉద్యోగులకు మే నెల జీతం ఆపేయనున్నట్లు ప్రకటించడంతో, సాలరీ ఆగిపోతుందనే భయంతో ఉద్యోగులు టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు పేర్కొన్నారు.