వాషింగ్టన్: చంద్రుడిపై ఆవాసం ఏర్పరుచుకోవడానికి ఎన్నో దశాబ్ధాలుగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయోగాల ద్వారా చంద్రుపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్తలు, ఆ ప్రాంతం మానవ నివాస యోగ్యంగానే ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇక 2028 నాటికి వ్యోమగాములు చంద్రునిపై కొన్ని పనులు కూడా ప్రారంభించడానికి నాసా ఇప్పటి నుంచే ప్రయోగాలు చేస్తోంది.
దానిలో భాగంగా చంద్రునిపై 4జీ సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకోసం నాసా ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియాకు సహాయాన్ని అందిస్తోంది. చంద్రునిపై 14.1 మిలియన్ డాలర్లతో సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి నోకియా చేపట్టిన ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు నాసా ప్రకటించింది.
అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్‌ను తయారు చేయడానికి, దానిని నిర్వహించడానికి ఉపయోపడే సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే వీటిలో ఎక్కువ డబ్బును ఈ సాంకేతికను అందించే స్పేస్‌ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. ఇక అనుకున్నట్లు చంద్రునిపై కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించుకోవచ్చు.