ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఏకంగా రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి.
గతంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో ఇది అతి పెద్దదిగా నిలవడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా 20,000 కోట్లకు పైగా ఆదాయం రాష్ట్రానికి లభించనుంది.
అదనంగా, లక్షమందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ పెట్టుబడులు ప్రధానంగా పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి కేటాయించబడతాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.
ఎన్టీపీసీ నూతన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌జీఈఎల్) మరియు ఇతర భాగస్వాములతో కలిసి ఈ ప్రాజెక్టులను అమలు చేయనుంది. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మైలురాయిగా నిలుస్తుందని పారిశ్రామిక నిపుణులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రణాళికలు ఇప్పుడు ఫలితాలను చూపిస్తున్నాయని మంత్రి గొట్టిపాటి రవి అభిప్రాయపడ్డారు.
ఎన్టీపీసీ పెట్టుబడులు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందడంతో, ఇది ఆర్థికంగా రాష్ట్రానికి బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.