హైదరాబాద్: నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారు దాదాపు గ ఉండరు. సినిమా రంగంలోనూ, రాజకీయాలలోనూ ఆయనది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం. రెండు రంగాలలోనూ విశేష జనాధరణ పొందిన వ్యక్తిగా ఆయన సుపరిచితుడు. ఎన్నో ఊర్లలో ఆయన విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి.
ఇదంతా ఇప్పుడెందుకంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దివంగత ఎన్టీఆర్ అంటే ఎంతటి గౌరవాభిమానాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ‘ఒక్క మగాడు’ అంటూ పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రశంసించేవారు. అంతేకాదు, ఎన్టీఆర్ మీద అభిమానంతో తన తనయుడికి తారకరామారావు అని పేరు కూడా పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఒక పాఠ్యాంశాన్ని ప్రవేశా పెట్టారు. సోషల్ స్టడీస్ లో 268 పేజీ నంబర్ లో ఎన్టీఆర్ కు సంబంధించిన కీలక అంశాలను పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టడంతో ఆయన అభిమానులు అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క, తన తండ్రి జీవితాన్ని గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పాఠ్య పుస్తకంలో ప్రచురించడం పట్ల నందమూరి బాలకృష్ణ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఫేస్ బుక్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.