అమరావతి: దూసుకొస్తున్న వాయుగుండం – ఏపీకి హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా మారి 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ప్రస్తుతం వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశలో 15 కిలోమీటర్ల వేగంతో కదలుతున్నది. భారత వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఈ వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు 370 కిలోమీటర్ల, చెన్నైకు 280 కిలోమీటర్ల, పుదుచ్చేరికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో, రాయలసీమ మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సిద్ధంగా ఉన్న బృందాలు:
అనూహ్య వరదలతో ఇప్పటికే అల్లాడుతున్న ఏపీ రాష్ట్రానికి, తాజా వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అవసరమైతే, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. పునరావాస కేంద్రాలను కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడాన్ని కూడా ప్రణాళిక చేసారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు:
వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలుప్రాంతాల్లో కుంభవృష్తి కురుస్తోంది. రాత్రి నుంచి ఉరుములు మెరుపులుతో భారీ వర్షం పడుతోంది. కావలిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో గాలులు తీవ్రత పెరిగింది. పలు జిల్లాలో ఇవాళ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. జిల్లా కలెక్టరేట్ తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్లు:
- తిరుపతి కలెక్టరేట్: 0877-2236007
- గూడూరు సబ్ కలెక్టరేట్: 86242 52807
- సూళ్లూరుపేట ఆర్‌డీవో కార్యాలయం: 86232 95345
- తిరుపతి ఆర్‌డీవో కార్యాలయం: 70321 57040
- శ్రీకాళహస్తి ఆర్‌డీవో కార్యాలయం: 99665 24952
చంద్రబాబు ఆదేశాలు:
ముఖ్యమంత్రి చంద్రబాబు, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మరియు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజలకు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తున్నాయి. రోజువారీ కూలిపనులు దెబ్బతిని ఆదాయం రావడం లేదు. మత్స్యకారులకు కూడా అధికారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే, వరద ముప్పు తప్పదని తీరప్రాంత ప్రజలు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
తిరుమల పర్యాటకుల కోసం హెచ్చరికలు:
టీటీడీ అధికారులు, తిరుమల శ్రీవారి మెట్టు నడక దారిని రేపు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాల ప్రభావం వల్ల, తిరుమల ఘాట్ రోడ్డు పై కొండచరియలు పడే అవకాశం ఉండటంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఘాట్ రోడ్డులో కొండచరియలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వర్షం కురుస్తున్నందున, భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు.