న్యూఢిల్లీ: భారత దేశంలో జమిలి ఎన్నికలు (‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’) ఆలోచన అనేది కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేయకుండా దీనిని ఆచరణలో పెట్టడం ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
గుజరాత్ కెవాడియాలో గురువారం జరిగిన 80వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తన ప్రసంగం అందించారు. దేశవ్యాప్తంగా కొన్ని నెలల వ్యవధిలో నిర్వహించే ఎన్నికలు, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తాయని, ఈ కారణంగా ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై దృష్టి పెట్టాసిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.
ఇందు కోసం లోతైన అధ్యయనం, చర్చ కూడా అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రిసైడింగ్ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ అంశంపై చర్చకు నాంది పలకాలని ఆయన కోరారు. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ, స్థానిక ఎన్నికలకు వేర్వేరు ఓటింగ్ కార్డులు అవసరం లేదని తెలిపారు.
లోక్‌సభ, విధానసభ, ఇతర ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను మాత్రమే ఉపయోగించాలని, ఈ జాబితాల తయారీకి ఎందుకు సమయం, నిధులు వృథా చేస్తున్నామని మోదీ ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ను కీలకంగా పొందుపరిచింది.
జమిలీ ఎన్నికల విషయంపై మోదీ ఇప్పటికే అనేకసార్లు, అనేక సందర్భాల్లో ప్రసంగించారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’పై చర్చించేందుకు గతేడాది జూన్‌లో ప్రధాని అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేకమంది కీలక నాయకులు హాజరుకాకపోవడంతో ఈ విషయంపై చర్చ సరిగ్గా జరగలేదు.
దేశంలో చట్టాల భాష మరింత సరళంగా, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. దీని ద్వారా ప్రజలు ప్రతి చట్టంతో ప్రత్యక్ష సంబంధాన్ని పొందగలుగుతారని తెలిపారు. వాడుకలో లేని చట్టాలను తొలగించే ప్రక్రియ సరళంగా ఉండాలని, పాత చట్టాలను సవరించేటప్పుడు వాటిని రద్దు చేసే వ్యవస్థ స్వయంచాలకంగా ఉండాలని ప్రధాని సూచించారు. ఈ వ్యవస్థలపై 130 కోట్ల మంది భారతీయులకు ఉన్న విశ్వాసం కారణంగానే ఇది సాధ్యమైందని, ఈ విశ్వాసం మారుతున్న సమయానికి అనుగుణంగా మరింత బలపడిందని ప్రధాని తెలిపారు.
నో యువర్ కస్టమర్(కేవైసీ)ని కార్పొరేట్ సంస్థల్లో వినియోగించుకున్నట్లే ప్రతి పౌరుడికీ మన రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు నో యువర్ కాన్‌స్టిట్యూషన్(కేవైసీ) చాలా అవసరమన్నారు. బాధ్యతలు తెలుసుకుని మసలుకునే వారికి హక్కులు కూడా వాటంతటవే సమకూరుతాయన్నారు.
12 ఏళ్ల క్రితం ఇదే రోజు జరిగిన 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా దళాలకు ఈ సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. ‘ఇదే రోజు 2008లో దేశంపై అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. అనేక దేశాలకు చెందిన వారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ నా నివాళులు. ముంబై దాడులతో ఏర్పడిన గాయాలను దేశం ఎన్నటికీ మరువదు. ఉగ్రవాదులపై జరిగిన పోరులో ప్రాణాలర్పించిన జవాన్లకు ఘన నివాళులు’అని అన్నారు.