న్యూఢిల్లీ: చైనా మొబైల్ కంపెనీ వన్ ప్లస్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ బ్రాండ్ ను చివరకు ఒప్పో కంపెనీలో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది. వన్ ప్లస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ పీట్ లావ్ మాట్లాడుతూ, మరింత మంది వినియోగదారులకి చేరుకునే ప్రయత్నంలో భాగంగా వన్ ప్లస్ ను ఒప్పోలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా ఈ విలీనం జరిగిన తరువాత కూడా వన్ ప్లస్, ఒప్పో రెండూ ప్రత్యేక కంపెనీ బ్రాండ్లుగా స్వతంత్రంగానే పనిచేస్తాయని ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. వన్ ప్లస్ ఈ మధ్యే సరసమైన స్మార్ట్ ఫోన్ నార్డ్ సీఈని భారతదేశం, ఇతర మార్కెట్లలో లాంఛ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
వన్ ప్లస్ కస్టమర్ ల కొరకు “ఇంకా మెరుగైన ఉత్పత్తులను” అందించడానికే తాము ఒప్పోతో విలీనం అయినట్లు సీఈఓ ఫోరం పోస్ట్ లో అన్నారు. వన్ ప్లస్, ఒప్పో రెండూ చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం కిందనే ఉన్నాయి. వాటితో పాటు వివో, రియల్ మీ వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి.
ఈ కంపెనీలన్నీ, వాటి ప్రారంభం నుంచి అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయి. వన్ ప్లస్ ను లావ్, అతని కార్ల్ పెయ్ కూడా సహ-స్థాపించారు. డిసెంబర్ 2013లో కంపెనీ స్థాపించడానికి ముందు ఇద్దరూ ముందు ఒప్పోలో పనిచేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల మరిన్ని మంచి ఉత్పత్తులను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు రెండు సంస్థలు తెలిపాయి.