ముంబై: దేశంలో ఇప్పుడు అసలే పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాల ధరలు అమాంతంగా పెరిగుతుంటే అదే దారిలో ఇప్పుడు ఉల్లిపాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. గడచిన కొద్ది వారాల క్రితం నుండి ఉల్లి ధర రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉల్లి ఒక కిలోకు 25-30 రూపాయలకు విక్రయిస్తుండగా అది ఇప్పుడు ఒక కిలోకు 60-70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
పెరిగిన ఈ ధరల వల్ల సామాన్యులకు చుక్కలు కనిపడుతున్నాయి, ఇలా ధరలు పెరిగిపోతుండటంతో ప్రజల ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
సరైన ఉత్పత్తి లేకపోవడం వల్ల కూడా సరఫరా బాగా తగ్గింది. ఇప్పుడు దాని ప్రభావం ధరలపై కనిపిస్తోంది. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెండు రెట్లకు పైగా పెరిగింది. నవీ ముంబైలోని ఎపిఎంసి మార్కెట్లో గతంలో ఉల్లిపాయ కిలోకు 30-40 రూపాయల హోల్‌సేల్ ధరకు అమ్మేవారు. ముంబై, థానే, పూణే రిటైల్ మార్కెట్లలో ప్రస్తుతం ఉల్లిపాయ కిలోకు రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముడవుతోంది.
దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ అయిన లాసల్‌గావ్‌లో ఉల్లిపాయల టోకు రేటు గత 10 రోజుల్లో 15శాతం నుంచి 20శాతానికి పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం రిటైల్ లో ఉల్లిపాయ ధర కిలోకు రూ.54గా ఉంది. మరోవైపు, డీజిల్ ధరలు నిరంతరం పెరగడం కూడా ఒక ప్రధాన కారణం, ఎందుకంటే సరుకు రవాణా మరింత ఖరీదైనది. జనవరి 1న ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు 73.87 రూపాయలు ఉండగా నేడు అది 78.38 రూపాయలుగా ఉంది.