హైదరాబాద్: గత వారం తెలంగాణలో జులై 1వ తేదీ నుండి ప్రత్యక్ష తరగతులు జరుగుతాయని ప్రకటించింది. అయితే మళ్ళీ నిర్ణయం మార్చుకుండి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జూలై 1 నుంచి అందరికీ ఆన్లైన్ తరగతులు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఈ క్లాసులు టీ శాట్ ద్వారా ఆన్లైన్లోనే విద్యాబోధన జరుగుతుందన్నారు. అలాగే కేజీ టు పీజీ వరకు ఆన్లైన్ తరగతులే ఉంటాయన్న మంత్రి డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు మాత్రం యథాతథంగానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వాటితో పాటు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీల్లో మార్పులు ఏమీ లేవని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
అలాగే విద్యాసంస్థల ఫీజుల విషయంలో జీవో నంబర్ 46ని అనుసరించాలని, కేవలం నెలవారీగా మాత్రమే ట్యూషన్ ఫీజు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇంటర్ సెకండియర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విడుదల చేశారు. ఆన్లైన్లో బోధన విషయానికొస్తే, 50 శాతం టీచర్లు ఒకరోజు, మిగిలిన 50 శాతం టీచర్లు తర్వాతి రోజు క్లాసులకు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.