అమరావతి: కరోనా నేపథ్యంలో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ శాఖ పాత్ర అత్యంత కీలకమైనదని ఏపీ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజున మంత్రి మేకపాటి ఐటీ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఇండస్ట్రియల్ పాలసీతో పాటుగా, ఐటీ పాలసీనీ ప్రకటించడానికి సిద్ధమవ్వాలన్నారు. సైబర్ సెక్యూరిటీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఐటీ రంగంలో భారీ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టాలి. తక్కువ ఖర్చు తో ఐటి సంస్థలను ఏర్పాటు చేయడంలో ఏపీ అత్యంత అనుకూలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీకి గమ్యస్థానంగా నిలిచే అన్ని వనరులు గలదన్నారు.
నిరుద్యోగులకు విద్య, అర్హతలు, అవకాశాలను బట్టి నేరుగా ఉపాధి వివరాలు తెలుసుకునే విధంగా ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రొక్యూర్‌మెంట్, ఇన్‌ఫ్రా & కమ్యునికేషన్స్ కింద ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సెర్వీసెస్ (ఏపీటీఎస్) ‘మీ-సేవ’ టెక్నికల్‌గా గ్రామసచివాలయాల (పంచాయతీరాజ్ శాఖ) పరిధిలోకి తీసుకువెళ్లడంపైనా చర్చించారు.
దీనిపై జీవో ఇచ్చినా ఇంకా సాంకేతిక కారణాల దృష్ట్యా ఐటీ పరిధిలోనే ఉందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సుందర్ మంత్రికి వివరించారు. జీఏడీ దృష్టికి తీసుకువెళ్లి ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి మేకపాటి అధికారులకు సూచించారు.