ధోర్డొ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసరంగా దేశంలోని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ప్రతిపక్షాలు రైతులను గందరగోళ పరిచే కుట్రకు తెర తీశాయని ఆరోపించారు. వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను వాడుకుంటున్నారని మండిపడ్డారు.
నూతన సాగు చట్టాలు చాలా చరిత్రాత్మకమైనవని, రైతుకు ప్రయోజనం చేకూర్చుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త చట్టాల్లో రైతులకున్న అన్ని అభ్యంతరాలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఇప్పడు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యవసాయ సంస్కరణలకు మద్దతిచ్చినవేనని పేర్కొన్నారు. అయితే, వారు అప్పుడు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నో రైతు సంఘాలు ఈ సంస్కరణలను అమలు చేయాలని కోరాయని గుర్తు చేశారు.
తన సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో మంగళవారం మోడీ పర్యటించారు. కచ్ జిల్లాలో మూడు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ప్రభుత్వ జోక్యం లేకుండా, గుజరాత్‌లో పాడి, మత్స్య రంగాలు అభివృద్ధి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. సహకార రంగం, రైతులే స్వయంగా ఈ రంగంలో వ్యాపారం సాగించారన్నారు.
అదే విధంగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పాడి పరిశ్రమ ప్రభుత్వ జోక్యం లేకుండానే అభివృద్ధి చెందిందని ప్రధాని తెలిపారు. పాల ఉత్పత్తిదారులు, సహకార రంగం కలిసి అద్భుతమైన పంపిణీ వ్యవస్థను రూపొందించుకున్నాయన్నారు. అలాగే, పండ్లు, కూరగాయల విషయంలోనూ ప్రభుత్వ జోక్యం ఉండదని గుర్తు చేశారు.
రైతులను గందరగోళపర్చి, ఆందోళన బాట పట్టించే కుట్ర జరుగుతోందన్న విషయం వివరించడానికే ఈ ఉదాహరణలన్నీ చెబుతున్నానన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే, తమ భూములను ఎవరో లాక్కుంటారన్న భయాన్ని రైతుల మనసుల్లో చొప్పిస్తున్నారని విమర్శించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని అక్కడి రైతులతో, స్వయం సహాయ బృందాలతో సమావేశమయ్యారు. కచ్ జిల్లాలో ఉంటున్న పంజాబీలు కూడా ఆ రైతుల్లో ఉన్నారు.