హైదరాబాద్: మా ఫ్యామిలీ వివాదాలు త్వరలోనే పరిష్కారం అవుతాయి అని ఆశాభావం వ్యక్తం చేసారు మంచు విష్ణు
రెండు కేసులు నమోదు
మంచు ఫ్యామిలీ అంతర్గత వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తండ్రి మంచు మోహన్‌బాబు, కుమారుడు మంచు మనోజ్ మధ్య ఏర్పడిన గోడవల నేపథ్యంలో ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల మేరకు పహాడీషరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేశారు.
మోహన్‌బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనికపై IPC సెక్షన్లు 329, 351 కింద కేసులు నమోదు చేశారు. మంచు మనోజ్ ఫిర్యాదులో మోహన్‌బాబు అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
విష్ణు స్పందన
ఈ ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. తాము కుటుంబ సభ్యుల మధ్య చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నామని, అవి త్వరలోనే పరిష్కారమవుతాయని చెప్పారు. ఫ్యామిలీ గొడవలను పబ్లిక్‌గా పెద్ద సమస్యలుగా చూపించడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని మోహన్‌బాబు
మంచు మోహన్‌బాబు తమ కుటుంబంలో నెలకొన్న వివాదంపై స్పందిస్తూ, అన్నదమ్ముల మధ్య చిన్న గొడవలు సహజమని తెలిపారు. ఈ అంశాన్ని పెద్ద విషయంగా చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయని, ఇవి అంతర్గతంగానే పరిష్కారమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.