అమరావతి: ఏపీలో పాఠశాల విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్–ఇంగ్లిష్–తెలుగు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను ఉచితంగా అందివ్వనుంది. ఈ డిషనరీల కొనుగోలుకు అనుమతిస్తూ సోమవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–36 విడుదల చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అందరు విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఇప్పటికే మూడు జతల యూనిఫారం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఒక జత షూలు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగును అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
2021–22 విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అందివ్వడానికి ప్రభుత్వం రూ.731.30 కోట్లను మంజూరు చేసింది. క్రితం ఏడాది ఇచ్చిన వస్తువులతో పాటు ఈ సంవత్సరం అదనంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లి్లష్–ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీలను అందించాలని ఇందుకోసం నియమించిన కమిటీ గుర్తించింది.