దుబాయ్: పాకిస్తాన్ ఎట్టకేలకు భారత్ పై తొలి సారి వరల్డ్ కప్ లో గెలిచి తమ చిరకాల వాంచను తీర్చుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ లో భారత్ పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించి మొత్తానికి వరల్డ్ కప్ లో భారత్ పై గెలిచింది. పైగా పది వికెట్ల తేడాతో భారత్ పై ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కు మొదటి ఓవర్లోనే రోహిత్ శర్మ వికెట్ దొరకడంతో ఇక అక్కడి నుండి భారత్ పై పైచేయి సాధించింది. మూడవ ఓవర్లో రాహుల్ ని కూడా అవుట్ చేసిన షాహీన్ ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. కాగా కోహ్లీ ఆచితూచి ఆడడం, సూర్యకుమార్ చిన్నపాటి మెరుపులు, రిషబ్ పంత్ టాప్ గేర్ లో ఆడడం వల్ల భారత్ కు గౌరవప్రదమైన 151 స్కోరు లభించింది.
చేజింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ ఒక వికెట్ కూడా నష్టపోకుండా 151 పరుగులను అలవోకగా చేధించింది. బాబర్ అజం, రిజ్వాన్ ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని కేవలం 17.5 ఓవర్లలోనే ఛేజ్ చేసి రికార్డు సృష్టించారు. పాకిస్తాన్ కు టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై ఇదే తొలి గెలుపు కావడం విశేషం. ఈ గెలుపుతో పాకిస్తాన్ సంబరాలు అంబరాన్ని తాకాయి.
కాగా బ్యాటింగ్ లో అంతో ఇంతో దూకుడు చూపించిన భారత్ బౌలింగ్ లో మాత్రం పాకిస్తాన్ బ్యాటింగ్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. వికెట్లు తీయడం అటుంచి పరుగులను కూడా కట్టడి చేయలేకపోయారు.