స్పోర్ట్స్ డెస్క్: చాంపియన్స్ ట్రోఫీలో విఫలమైన పాకిస్థాన్, టీ20లో కూడా అదే దారుణ ప్రదర్శనను కొనసాగించింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. ఇది టీ20ల్లో వారి అత్యల్ప స్కోరుగా నిలిచింది.
సల్మాన్ అలీ అఘా నాయకత్వంలోని పాక్ టీమ్, 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ఖుష్దిల్ 32 పరుగులు చేశాడు. కానీ, ఇద్దరు బ్యాట్స్‌మెన్ డకౌట్ కాగా, ఆరుగురు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. 2016లో 101 పరుగులు చేసిన పాక్, ఈసారి వంద పరుగుల మార్క్ కూడా దాటలేక పోయింది.
కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 3 వికెట్లు తీసి మెరవగా, మిచెల్ సాంట్నర్, మట్ట హెన్రీలు 2 వికెట్లు పడగొట్టారు. పాక్ బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ పూర్తిగా న్యూజిలాండ్ వైపు మొగ్గింది.
92 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్, 9 ఓవర్లలోనే 76 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ 44 పరుగులతో మెరిపించగా, ఫిన్ అలెన్ 17, టిమ్ రాబిన్సన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ ఓటమితో పాకిస్థాన్, తమ బ్యాటింగ్ లోపాలను మరోసారి బయటపెట్టుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో పాక్ గాడిలో పడుతుందా? లేక మరింత దారుణంగా ఆడుతుందా అన్నది చూడాలి.